మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది……….
మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది.
“మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.”
గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు………………
అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు………….
ఇక .. మహాశివరాత్రి కథ … భ్రహ్మ విష్ణు సంవాదములో … విష్ణువు సత్యం పలకగా , భ్రహ్మ అసత్యాన్ని ఆశ్రయిస్తాడు … తద్వారా .. శివుడికి కోపమొచ్చి …..అసత్యాన్ని సహించలేక ….
“అరాజ భయమేతద్వైజగత్సర్వం నశిష్యతి! తతస్త్వం జహి దండార్హం వహ లోకథురం శిశో!!
వరందదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్! వైతానికేషు గృహ్యేషు యజ్ఙేషు చ భవాన్గురుః!!
నిష్ఫలస్త్వదృతే యజ్ఙః సాంగశ్చ సహ దక్షిణః!” ……..
శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను (పిల్లవానిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకొన్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా) ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మని క్షమించి, “ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. ఎవరేని చేసిన యజ్ఙములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించినా, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును” అని వరమిచ్చెను……….
అలాగే … మొగలి పువ్వు , కామధేనువుకు కూడా శాపము …..
(మొగలిపువ్వు ) కేతకీపుష్పము వైపు చూసి, అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు……..
అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, ” మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును” అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి……
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో “మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది……………..
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది” అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు…………….
జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున ఉపవాసం ఉంటారు……………………..
” ఓం నమో భగవతే రుద్రాయ … తత్ సత్ …”