​శివరాత్రి ఎలా జరుపుకోవాలి…..


సనాతన సంస్కృతి లో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు.
ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది.

ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి.
శివరాత్రి యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోడానికి ఆత్మ సాక్షత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
1) ఉపవాసం 

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని.. చిన్న పిల్లలకు, ముసలి వాళ్ళకు, అనారోగ్యంతొ బాధపడే వాళ్ళకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్ళకు మినాహయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, తర్వాత రోజు కూడా నిష్ఠగా ఉండాలి.

ఉపవాసం ఉండే రోజు ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండటం అని. భగవంతునికి మనస్సును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం.

మరీ నీళ్ళు కూడ తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.
2) జీవారాధన 

ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వర సేవయో అవుతుంది. అందుకే స్వామి వివేకానంద జీవారాధానే శివారాధన అన్నారు.

శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తి ని శరీరం గ్రహించాలి అంటే వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చుని నిలబడాలి.
3) మౌనవ్రతం

శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం అవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణం అవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టి పెట్టి మనసుని శివుని పై కేంద్రీకరించాలి.
4) అభిషేకం

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు.

శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల, భేదం లేకుండా శివుడికి అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పీడ తొలిగిపోతుంది.
5) జాగరణ

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణ మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, చేసే జాగరణ అది జాగరణ అవ్వదు. కాలక్షేపం మాత్రమే అవుతుంది.
6) మంత్రజపం

ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మహా మంత్ర జపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.
శివరాత్రి మరునాడు శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి  భోజనం చేసి ఉపనాస వ్రతం ముగించాలి.
అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాస జాగరణ చేసిన వారు, తరువాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పండితులు  చెబుతారు. 

🙏 దువ్వూరు గంగాధర్ రెడ్డి 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *